Telangana: కేసీఆర్ ‘ఉద్యమ సింహం’ సినిమాను ఆపేయండి.. ఎన్నికల సంఘానికి వీహెచ్ విజ్ఞప్తి!
- ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేసేలా ఉంది
- తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చింది
- కానీ కేసీఆర్ తెచ్చినట్లు సినిమా తీశారు
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఉద్యమ సింహం’ సినిమా ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అయితే, కేసీఆర్ వల్లే రాష్ట్రం వచ్చినట్లు సినిమా తీశారని మండిపడ్డారు. ఈ సినిమా విడుదలను వచ్చే నెల 11 వరకూ నిలిపివేయాలని కోరుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాకు వినతిపత్రం అందజేశారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని వీహెచ్ జోస్యం చెప్పారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందనీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.