dinakaran: దినకరన్ కు ఎన్నికల గుర్తుగా 'గిఫ్ట్ ప్యాక్'ను కేటాయించిన ఈసీ
- గత ఉప ఎన్నికల్లో ప్రెషర్ కుక్కర్ గుర్తుపై గెలుపొందిన దినకరన్
- పార్టీకి కామన్ సింబల్ గా ప్రెషర్ కుక్కర్ ను ఇవ్వాలంటూ డిమాండ్
- ఏఎంఎంకే విన్నపాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు
దినకరన్ నాయకత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో కామన్ సింబల్ గా గిఫ్ట్ ప్యాక్ ను ఎన్నికల సంఘం కేటాయించింది. ఏఎంఎంకే అభ్యర్థులకు ప్రెషర్ కుక్కర్ సింబల్ ను కేటాయించాలంటూ ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ గుర్తును కేటాయించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయడానికి సుప్రీం నిరాకరించింది. కేసును విచారించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం... ప్రెషన్ కుక్కర్ సింబల్ ను ఇవ్వాలంటూ ఈసీని ఒత్తిడి చేయలేమని... అందుబాటులో ఉన్న ఐదు ఫ్రీ సింబల్స్ లో ఒక గుర్తును ఏఎంఎంకేకు కేటాయించాలని తీర్పును వెలువరించింది.
గత ఏడాది ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో దినకరన్ ప్రెషర్ కుక్కర్ గుర్తుతో గెలుపొందారు. దీంతో, పార్టీ మొత్తానికి అదే గుర్తును కేటాయించాలంటూ ఆయన పార్టీ డిమాండ్ చేసింది. తమిళనాడులో మొత్తం 39 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 18న పోలింగ్ జరగనుంది.