Nellore District: శ్రీహరికోటలో సందర్శకుల సముదాయ నిర్మాణం... రాకెట్ ప్రయోగాలను నేరుగా చూసే అవకాశం!
- గుర్తింపు కార్డు ఉంటే ఎవరైనా వీక్షించవచ్చు
- రూ.180 కోట్లతో నిర్మాణాలను చేపట్టిన ఇస్రో
- తొలి దశ పనులు పూర్తికావడంతో 31న ప్రారంభం
ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకు వెళ్లే రాకెట్ ప్రయోగాలను ప్రత్యక్షంగా వీక్షించాలన్న కుతూహలం ఎవరికైనా సహజం. కానీ ఈ అవకాశం అందరికీ లభించదు. అత్యంత కఠినమైన భద్రతా నియమాలుండే షార్ వంటి రాకెట్ ప్రయోగ కేంద్రాల్లోకి ప్రవేశించాలంటే యాజమాన్యం ముందస్తు అనుమతి తప్పనిసరి. అది కూడా అందరికీ అవకాశం వస్తుందన్న గ్యారంటీ లేదు.
అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సామాన్యులు సైతం ప్రయోగాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలైన ప్రాజెక్టును భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టింది. ఇందుకోసం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోటలో రూ.180 కోట్ల వ్యయంతో భారీ నిర్మాణాన్ని చేపట్టింది. ఇక్కడి సతీశ్ థవన్ రాకెట్ ప్రయోగ కేంద్రంలో (షార్) సీఐఎస్‌ఎఫ్ బ్యారక్ సమీపంలోని 80 ఎకరాల స్థలంలో సందర్శకుల సముదాయం అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తికాగా ఈనెల 31న దీన్ని ప్రారంబించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సామాన్యులు సైతం తమవద్ద ఉన్న వ్యక్తిగత గుర్తింపు కార్డును చూపించి ఇందులోకి ప్రవేశించవచ్చు. రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ కేంద్రంలో ఎంట్రెన్స్ ప్లాజా, అంతరిక్ష థియేటర్, అంతరిక్ష మ్యూజియం, నాలెడ్జి లెర్నింగ్ సెంటర్, రాకెట్, ఉపగ్రహాల గార్డెన్, లాంచ్ వ్యూ గ్యాలరీ, బస్సు టూర్ పాయింట్ అందుబాటులోకి రానున్నాయి.
అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ సముదాయంలో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించడంతోపాటు అంతకు ముందు, వెనుక జరిగే కార్యక్రమాలన్నీ వీడియోలో చూడచ్చు. ఒకేసారి పదివేల మంది చూసేందుకు వీలున్న ఈ సముదాయంలోకి రాకెట్ ప్రయోగాలు లేని సమయంలోనూ అనుమతిస్తారు.
తొలి దశలో ఐదువేల మంది ప్రత్యక్ష వీక్షణకు అవసరమైన సదుపాయాలతో నిర్మాణాలు పూర్తికాగా ఈనెల 31న సాయంత్రం ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ దీన్ని ప్రారంభిస్తారు. షార్ మొదటి ప్రవేశ ద్వారం సమీపంలోని శబరి గిరిజన కాలనీ మీదుగా ఈ సముదాయానికి వెళ్లేలా మార్గాన్ని నిర్మించారు.