Chandrababu: తుపాకులు, బాంబులకే భయపడలేదు, వీళ్లిద్దరికీ భయపడతానా?: చంద్రబాబు

  • మోదీ, కేసీఆర్ నాకో లెక్కా?
  • జగన్ కు ఓటేస్తే నాశనమే
  • విజయవాడ పటమటలో చంద్రబాబు రోడ్ షో

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయవాడ పటమటలో రోడ్ షో నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి మనపై కుట్రలు జరుగుతున్నాయంటూ చంద్రబాబు మోదీ, కేసీఆర్, జగన్ లపై మండిపడ్డారు. విభజన హేతుబద్ధంగా జరగలేదని, కట్టుబట్టలతో అవమానించి పంపారని ఆరోపించారు. ఎంతో అమర్యాదకరమైన భాష మాట్లాడుతూ కించపరిచాడని అన్నారు. కానీ, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి అడ్డుపడాలని చూస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, ఖబడ్దార్ కేసీఆర్ జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించారు. నీ జోలికి మేం రాం, మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టబోమని అన్నారు. '24 బాంబులు పేలితేనే నేను భయపడలేదు, ఈ కేసీఆర్, మోదీలకు భయపడతానా?' అంటూ ప్రశ్నించారు. భయమన్నది తనకు తెలియదని అన్నారు.

ఇప్పుడో కోడికత్తి పార్టీ వచ్చిందని, ఆ పార్టీకి ఓటేస్తే మన తలపై మనం భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టేనని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని కావడం జగన్ కు ఇష్టంలేదని, ఇంతవరకు రాజధాని అమరావతి గురించి మాట్లాడని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇది ప్రజలపై జరుగుతున్న దాడి అని, ప్రజలపై దాడి అంటే మొదట తనపై చేయాలని, అందుకు తనను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని వివరించారు. ఎవరైనా ఇష్టానుసారం అణగదొక్కాలని ప్రయత్నిస్తే మరింత రెచ్చిపోతామని స్పష్టం చేశారు. ఇన్ కమ్ ట్యాక్స్ లు, ఈడీలకు భయపడతానా? తుపాకులు, బాంబులకే భయపడలేదని, వీటికి భయపడతానా? అంటూ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News