Chandrababu: ఫలించిన టీడీపీ యత్నం.. పోటీ నుంచి తప్పుకున్న తిరుగుబాటు అభ్యర్థులు
- నేటితో ముగిసిన నామినేషన్ల గడువు
- రంగంలోకి దిగిన చంద్రబాబు
- ఎమ్మెల్సీ ఇస్తామని హామీ
తిరుగుబాటు అభ్యర్థులను బరిలో నుంచి తప్పించేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియడంతో సీఎం చంద్రబాబుతో పాటు, టీడీపీ అగ్ర నేతలు రంగంలోకి దిగారు. తిరుగుబాటు అభ్యర్థులకు నచ్చజెప్పడంతో వారు పోటీ నుంచి తప్పుకున్నారు. 12 నియోజక వర్గాలకు చెందిన తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే నియామక పదవులు కానీ, ఎమ్మెల్సీ కానీ ఇస్తామని అధిష్ఠానం హామీ ఇవ్వడంతో తిరుగుబాటు అభ్యర్థులు శాంతించారు.
పార్టీకి చెందిన అభ్యర్థులతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. నామినేషన్లను ఉపసంహరించుకున్న వారిలో పుట్టపర్తిలో గంగన్న, మల్లెల జయరామ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కోడెల సూర్యలత, తాడికొండలో బెజ్జం సాయిప్రసాద్, చీపురుపల్లి నియోజకవర్గంలో త్రిమూర్తుల రాజు, పలమనేరులో సుభాష్ చంద్రబోష్, కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి, విశాఖ సౌత్‌లో మహ్మద్ సాదిక్, నెల్లూరు రూరల్‌లో దేశాయశెట్టి హనుమంతరావు, గాజువాకలో లేళ్ల కోటేశ్వరరావు, మాచర్లలో చలమారెడ్డి, రాయదుర్గంలో దీపక్ రెడ్డి, రాజోలులో బత్తుల రాము ఉన్నారు.