Chandrababu: నూటికి నూరుశాతం కాదు, 1000 శాతం మేమే గెలుస్తున్నాం: చంద్రబాబు ధీమా

  • ప్రజల మీద భారం పడకుండా పాలిస్తున్నాం
  • ఇలాంటి పథకాలు చేపట్టే రాష్ట్రం మరొకటిలేదు
  • జక్కంపూడి కాలనీ సభలో చంద్రబాబు వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని జక్కంపూడి కాలనీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను సభకు వస్తున్నప్పుడు కనిపించిన జనసందోహం చూస్తుంటే నూటికి నూరుశాతం కాదు, 1000 శాతం తామే గెలుస్తామన్న ధీమా కలుగుతోందని చెప్పారు.

విభజన తర్వాత ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల నడుమ రాష్ట్రానికి వచ్చేశామని, అయితే ప్రజల మీద ఎలాంటి భారం పడకుండా అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. రూ.24,500 కోట్లతో రైతుల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండు హెక్టార్లు ఉంటే రూ.9,000, ఆపైన ఉంటే రూ.10,000 ఇస్తున్నామని తెలిపారు. రైతులకు నాలుగో విడత, ఐదో విడత నగదును ఏప్రిల్ నెలలో ఖాతాల్లో వేస్తున్నామని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు. పేదలకు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరొకటి లేదని స్పష్టం చేశారు.

అంతేకాదు, అనంతపురంలో నర్సమ్మ అనే వృద్ధురాలు తనను పెద్దకొడుకుగా భావించిన క్షణాలను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ నిమిషంలో ఐదేళ్లు పడిన కష్టాన్ని కూడా మర్చిపోయానని చంద్రబాబు తెలిపారు. భారతదేశంలో ఎక్కడన్నా ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నారా? అంటూ అడిగిన చంద్రబాబు, తాము అన్నా భోజన క్యాంటీన్ల ద్వారా ఆ ఘనత సాధించామని చెప్పారు. నిరుపేదల కుటుంబాల్లో లక్ష రూపాయలిచ్చి ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News