USA: భారత్ క్షిపణి ప్రయోగం జరిపిన కొన్నిగంటల్లోనే బంగాళాఖాతంపైకి వచ్చిన అమెరికా నిఘా విమానం 'కోబ్రా బాల్'!
- ఏశాట్ ప్రయోగంపై కన్నేసిన అమెరికా!
- గతరాత్రి బంగాళాఖాతంలో నిఘా విమానం ప్రవేశం
- స్పందించని అగ్రరాజ్యం
భారత రక్షణరంగ పాటవాన్ని మరింత ఇనుమడింపజేసేలా ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం దిగ్విజయం కావడం తెలిసిందే. ఏశాట్ గా పిలిచే ఈ ఉపగ్రహ విధ్వంసక క్షిపణి అంతరిక్ష యుద్ధం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. భారత్ కూడా ఏశాట్ క్షిపణి ప్రయోగ విజయం తర్వాత ఈ తరహా సాంకేతికత ఉన్న నాలుగో దేశంగా అవతరించింది. అయితే, భారత్ ఏశాట్ ప్రయోగం నిర్వహించిన కొద్దిసేపటికే అమెరికా నిఘా విమానం కోబ్రా బాల్ (ఆర్ సి 135-ఎస్) బంగాళాఖాతం గగనతలంలో ప్రవేశించింది. పరీక్ష జరిగిన కొన్ని గంటల తర్వాత కోబ్రా బాల్ బంగాళాఖాతం సముద్రంపై వాయువిహారం చేసింది. భారత్ చేపట్టిన ఏశాట్ ప్రయోగానికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించడానికే ఈ నిఘా విమానం వచ్చినట్టు రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.
సాధారణంగా, ఇరాన్, ఉత్తరకొరియా దేశాలు అణుపరీక్షలు నిర్వహించినప్పుడు ఈ విమానం వెళ్లి వివరాలు సేకరిస్తుంది. ఆ సమాచారం నేరుగా అమెరికా రక్షణ శాఖ మంత్రికి, జాతీయ భద్రత సలహాదారుకు చేరవేస్తారు. కోబ్రా బాల్ విమానాలను చాలాకాలం క్రితమే హిందూ మహాసముద్రంలోని డీగో గార్షియా దీవిలో మోహరించారు. ఈ ప్రాంతంలో చీమ చిటుక్కుమన్నా వివరాలు సేకరించడం కోబ్రా బాల్ ప్రధానవిధి. అందులో భాగంగానే, భారత్ ఏశాట్ ప్రయోగం జరిపిన తర్వాత బంగాళాఖాతంపైకి వచ్చి వెళ్లుంటుందని భావిస్తున్నారు. అయితే దీనిపై అమెరికా నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.