East Godavari District: ‘అన్న క్యాంటీన్’ లైన్ లో వైసీపీ కార్యకర్తలూ ఉన్నారు: నారా లోకేశ్
- ఐదు రూపాయలకు బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు
- అలాంటిది కేవలం రూ.5కే భోజనం పెడుతున్నాం
- బాబు సీఎంగా ఉన్నంత వరకూ కేసీఆర్ ఆటలు సాగవు
ఈరోజు పొద్దున్న వేరే మీటింగ్ కు వెళుతూ విశాఖపట్టణంలో ‘అన్న క్యాంటీన్’ చూశానని, చాలా పెద్ద లైన్ ఉందని, ఆ లైన్ లో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ఐదు రూపాయలకు బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదని, అలాంటిది, ఈ క్యాంటీన్ లో కేవలం ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నామని అన్నారు.
ఏపీలో జరిగినంత అభివృద్ధి దేశంలో ఇంకెక్కడా జరగట్లేదని, దీని కంతటికి కారణం సీఎం చంద్రబాబేనని ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై సెటైర్లు వేశారు. పోలవరం ప్రాజెక్టును కట్టనివ్వకూడదని, విభజన ద్వారా ఏపీకి వచ్చిన ముంపు మండలాలను తిరిగి తీసుకోవాలని కేసీఆర్ యత్నిస్తున్నారని విమర్శించారు. ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకూ తన ఆటలు సాగవని కేసీఆర్ కు తెలుసని, అందుకే, బలహీనుడైన జగన్ ని సీఎం చేయాలని చూస్తున్నారని అన్నారు.