Andhra Pradesh: బీజేపీ 273 హెలికాప్టర్లు వాడుతోంది.. వాటిలోనూ నగదు తరలిస్తున్నారా?: బీజేపీ విమర్శలకు కుటుంబరావు కౌంటర్

  • చంద్రబాబు హెలికాప్టర్ లో నగదు తరలిస్తున్నారన్న కన్నా
  • బీజేపీ నేత విమర్శలను దీటుగా తిప్పికొట్టిన కుటుంబరావు
  • వ్యక్తిగత దూషణలు మానుకోవాలని హితవు

తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటానని ఎప్పుడూ చెప్పలేదని ఏపీ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని కోరితే బీజేపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో జవాబు చెప్పాలన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి లేఖ ఇస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కుటుంబరావు మాట్లాడారు.

చంద్రబాబు హెలికాప్టర్లలో డబ్బులు తరలిస్తున్నారన్న కన్నా ఆరోపణలను ఖండిస్తున్నామని కుటుంబరావు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బీజేపీ 273 హెలికాప్టర్లను వాడుతోందని చెప్పారు. బీజేపీ నేతలు వాడుతున్న ఈ హెలికాప్టర్లలో కూడా డబ్బులు తరలిస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు నగదును తరలిస్తున్నారు కాబట్టే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. దేశంలో వృద్ధి  రేటు పెరిగిందని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని కుటుంబరావు తెలిపారు. కానీ  ఆ లెక్కలన్నీ తప్పు అని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News