Andhra Pradesh: విష్ణుకుమార్ రాజు వచ్చాడా.. అయితే నేను రాను.. విశాఖలో మీడియా ముఖాముఖికి మంత్రి గంటా డుమ్మా!

  • విశాఖ నార్త్ నియోజకవర్గంలో అభ్యర్థుల ముఖాముఖి
  • విష్ణుకుమార్ రాజు తన పరువు తీస్తారని గంటా వ్యాఖ్య
  • ఆయన ఉంటే తాను సమావేశానికి రానని స్పష్టీకరణ

ఏపీ విద్యాశాఖ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు విశాఖ జర్నలిస్ట్ ఫోరమ్ కు షాకిచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల ముఖాముఖికి తొలుత హాజరవుతానని చెప్పిన గంటా చివరికి ముఖం చాటేశారు. ఈ విషయాన్ని ఫోన్ లో మీడియా మిత్రులకు గంటా తెలియజేశారు. ఈ సమావేశానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజు కూడా వస్తున్నారని, ఆయన ఉంటే తాను ముఖాముఖికి రానని స్పష్టం చేశారు. ఒకవేళ తాను ముఖాముఖికి వస్తే రాజు తన పరువు తీస్తారని గంటా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున కేకే రాజు, బీజేపీ తరఫున విష్ణుకుమార్‌ రాజు, ఇక టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, జనసేన అభ్యర్థిగా పి. ఉషాకిరణ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా గోవిందరాజు పోటీ చేస్తున్నారు. ఈ ముఖాముఖి సదస్సుకు గంటా తప్ప మిగతా నేతలందరూ హాజరయ్యారు.

ఇటీవల విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. విశాఖ నార్త్ కొండలపై గంటా కన్నుపడిందనీ, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ఓటును రూ.10,000  పెట్టి కొంటున్నారని విమర్శించారు. గంటా పోలింగ్ ఏంజెట్లను సైతం కొనేసే ప్రమాదకరమైన వ్యక్తి అని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే విష్ణుకుమార్ రాజు పాల్గొంటున్న కార్యక్రమానికి గంటా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh
YSRCP
Telugudesam
BJP
Ganta Srinivasa Rao
  • Loading...

More Telugu News