Tejasvi Surya: బెంగళూరు సౌత్ అభ్యర్థి తేజస్వి సూర్యపై లైంగిక ఆరోపణలు.. చిక్కుల్లో బీజేపీ
- అనంత్‌కుమార్ భార్యకు బదులు తేజస్వికి బీజేపీ టికెట్
- అతడు మరో ఎంజే అక్బర్ కాబోతున్నాడంటూ కాంగ్రెస్ ఆరోపణలు
- ఆరోపణలపై స్పందించని బీజేపీ, తేజస్వి
బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ బరిలోకి దింపిన తేజస్వి సూర్యపై లైంగిక ఆరోపణలు ఇప్పుడు బీజేపీకి తలనొప్పిగా మారాయి. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తేజస్విపై ఆరోపణలు ఉన్నాయంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసి కలకలం రేపింది. ఈ ట్వీట్ కు మహిళ చేసిన ఆరోపణలను జత చేసింది. ‘తేజస్వి సూర్యను మరో ఎంజే అక్బర్‌లా తయారు చేస్తున్నారా?’ అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. బీజేపీకి ఇటువంటి వాళ్లే కావాల్సి వస్తున్నారని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ ట్వీట్‌పై అటు బీజేపీ కానీ, ఇటు తేజస్వి కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
జర్నలిస్టుపై లైంగిక ఆరోపణల కారణంగా మంత్రి ఎంజే అక్బర్ గతేడాది తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడా విషయాన్ని గుర్తుచేస్తూ తేజస్వి మరో ఎంజే అక్బర్ కాబోతున్నాడంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. నిజానికి బెంగళూరు సౌత్ నుంచి ఇటీవల మృతి చెందిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్ భార్య బరిలోకి దిగుతారని అందరూ భావించారు. అయితే, బీజేపీ అనూహ్యంగా బీజేపీ యూత్ వింగ్ లీడర్ తేజస్వి సూర్యను బరిలోకి దింపి అందరినీ ఆశ్చర్యపరిచింది. 28 ఏళ్ల సూర్య లాయర్. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.