poice officers: మా పొరపాట్లకు ఆధారాలు చూపండి...కడప, శ్రీకాకుళం ఎస్పీలు ఈసీకి లేఖ

  • విచారణ జరపకుండా ఎలా బదిలీ చేస్తారు
  • ఆరోపణలు చేసిన వారిపైనా చర్యలు తీసుకోండి
  • పరువు నష్టం దావా వేస్తానని ఒక ఎస్పీ హెచ్చరిక

తమపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎటువంటి విచారణ జరపకుండా తమను విధుల నుంచి ఎలా తొలగిస్తారంటూ కడప, శ్రీకాకుళం ఎస్పీలు రాహుల్‌దేవ్‌శర్మ, వెంకటరత్నంలు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు లేఖ రాశారు. ఏపీకి చెందిన ఈ ఇద్దరు పోలీసు అధికారులతోపాటు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును ఈసీ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఎస్పీలను రిలీవ్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వెంకటేశ్వరరావు ఎన్నికల విధుల్లో లేనందున ఆయనకీ ఉత్తర్వులు వర్తించవంటూ రిలీవ్‌ చేయలేదు. పైగా ఎవరెవరు ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తారో తెలియజేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీచేసింది. ఈ నేపథ్యంలో ఎస్పీలు ఈసీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తనపై ఆరోపణలు నిరూపించాలని, లేదంటే తనపై ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తన లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు ఎస్పీ వెంకటరత్నం మరో అడుగు ముందుకు వేస్తూ ఈసీ చర్యపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన ఈసీ అంతే వేగంగా తాను ఏం తప్పుచేశానో విచారణ జరిపించి ఆరోపణలు నిరూపించాలని కోరారు. తప్పుడు ఆరోపణలతో తన ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారని వాపోయారు. కుటుంబం, బంధువుల ముందు తలెత్తుకోలేకుండా చేశారని వాపోయారు. వీరి లేఖలపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News