Andhra Pradesh: ఏపీలో పోలీస్ అధికారుల బదిలీ అంశం.. సీఈసీని కలిసిన టీడీపీ నేతలు
- చంద్రబాబు రాసిన లేఖ సీఈసీకి అందజేత
- సీఈసీని వివరణ కోరేందుకు కలిశాం
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల వాయిదా వేయాలని వినతి
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సహా ఇద్దరు పోలీస్ అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ని టీడీపీ నేతలు సీఎం రమేశ్, జూపూడి ప్రభాకర్, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కలిశారు.
అనంతరం, మీడియాతో వారు మాట్లాడుతూ, ఈ విషయమై సీఈసీని వివరణ కోరేందుకు కలిశామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాసిన లేఖను సీఈసీకి అందజేశామని అన్నారు. ఎటువంటి విచారణ చేయకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని, ఇంటెలిజెన్స్ డీజీని ఎందుకు బదిలీ చేశారని సీఈసీని అడిగామని అన్నారు. ఈ వ్యవహారంపై కోర్టులోనే వివరణ ఇస్తామని సీఈసీ తమకు చెప్పారని తెలిపారు.
ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాలు కలిగేలా చేశారని, ఈసీ పరిధిలోకి ఎవరొస్తారో ప్రభుత్వం జీవో ఇచ్చిందని, ఈ జీవో మేరకు ఇంటెలిజెన్స్ డీజీ ఈసీ పరిధిలోకి రారని చెప్పామని, తాము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరామని తెలిపారు. అదేవిధంగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను వాయిదా వేయాలని కోరినట్టు చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ చిత్రం విడుదలను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని ఓ వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు.