Andhra Pradesh: నెత్తిన రూపాయి పెడితే దమ్మిడీకి విలువ లేని నాయకుడు ఫరూక్ అబ్దుల్లా!: ఐవైఆర్ కృష్ణారావు సెటైర్లు
- కశ్మీర్ ఉద్రిక్తత ఈ కుటుంబ నిర్వాకమే
- ఆయనే ఇప్పుడు టీడీపీ స్టార్ క్యాంపెయినర్
- ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ నేత
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో నిన్న జరిగిన సభలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ రూ.1500 కోట్లు ఆఫర్ చేశారని ఫరూక్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.
నెత్తిన రూపాయి పెడితే దమ్మిడీకి కూడా ఫరూక్ అబ్దుల్లా విలువ చేయడని ఎద్దేవా చేశారు. కశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి ఈ కుటుంబమే కారణమని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. దీన్ని ఈనాడు పత్రిక మొదటి పేజీలో ప్రచురించిందని ఎద్దేవా చేశారు. ఆ కూటమిలో నిరాశానిస్పృహలు ఏ స్థాయిలో ఉన్నాయనేది దీన్ని బట్టే అర్థం అవుతుందని అన్నారు.
ఈరోజు ట్విట్టర్ లో ఐవైఆర్ స్పందిస్తూ..‘నెత్తిన రూపాయి పెడితే దమ్మిడీకి విలువ లేని నాయకుడు ఫరూక్ అబ్దుల్లా. కశ్మీర్ సమస్య ఈ కుటుంబ నిర్వాకమే. ఆయన తెలుగుదేశానికి స్టార్ క్యాంపెయినర్. ఈనాడు వారి మొదటి పేజీ వార్త. ఆ కూటమిలో నిరాశానిస్పృహలు ఏ స్థాయిలో ఉన్నాయనేది దీనిని బట్టి అర్థం అవుతున్నది’ అని ట్వీట్ చేశారు.