Rahul Gandhi: పేదలకు కనీస ఆదాయ పథకం ప్రకటనకు ముందే రాహుల్ గ్రౌండ్ వర్క్
- పథకం ప్రకటనకు ఆరు నెలల ముందు నుంచే గ్రౌండ్ వర్క్
- ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థికవేత్తలతో చర్చలు
- మోదీ ఇస్తానన్న రూ. 15 లక్షల హామీని కూడా నిజం చేస్తామన్న రాహుల్
తాము అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయ పథకం తీసుకొస్తామని, ఈ పథకం కింద ఏడాదికి రూ.72 వేలు ఇస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను చర్చకు కారణమైంది. న్యూన్‌తమ్ ఆయ్ యోజన (న్యాయ్) పేరుతో తీసుకురానున్న ఈ పథకం పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ అని రాహుల్ అభిర్ణించారు. పేదలను నిర్మూలించాలని బీజేపీ చూస్తోందని, కానీ తాము పేదరికాన్ని నిర్మూలిస్తామని రాహుల్ పేర్కొన్నారు.
రాహుల్ ఈ పథకం ప్రకటనకు ముందు ఆరు నెలలుగా పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేసినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సహా ప్రముఖ ఆర్థికవేత్తలను తాను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకున్న మీదటే ఈ పథకాన్ని ప్రకటించినట్టు రాహుల్ స్వయంగా వెల్లడించారు. ఈ పథకంపై క్షుణ్ణంగా చర్చించిన తర్వాత నెలకు రూ.12 వేలు ఇవ్వాలన్న అభిప్రాయానికి వచినట్టు రాహుల్ తెలిపారు. అంతేకాదు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానంటూ ప్రధాని మోదీ ఇచ్చిన హామీని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిజం చేస్తామని కాంగ్రెస్ చీఫ్ హామీ ఇచ్చారు.