Chandrababu: ముస్లింలు ఏ తిండి తింటే మీకెందుకు?: కడపలో మోదీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
- ముస్లింలు ఏంచేయాలో మీరు డిసైడ్ చేస్తారా?
- వాళ్లు ఎక్కడికెళ్లాలో మీరు చెబుతారా?
- కడప రోడ్ షోలో చంద్రబాబు వ్యాఖ్యలు
కడప రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేశపూరిత ప్రసంగంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తాము బీజేపీతో చేయి కలపలేదని జగన్ చెబుతున్నదంతా బూటకమని నిన్న కేంద్రమంత్రి పియూష్ గోయల్ చెప్పిన మాటలతో బట్టబయలైందని చంద్రబాబు అన్నారు. టీఆర్ఎస్, వైసీపీ మా మిత్రపక్షాలు అని పియూష్ గోయల్ చెప్పాడని, మరి దీనికి జగన్ ఏమని బదులిస్తాడని ప్రశ్నించారు.
ప్రధాని మోదీపై ఆయన ఆరోపణలు చేస్తూ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముస్లింలకు భద్రతలేని పరిస్థితులు తీసుకువచ్చాడని మండిపడ్డారు. మీరే తిండి తింటే నరేంద్ర మోదీకి ఎందుకు? మీరు తినే తిండి ఆయన డిసైడ్ చేస్తాడా? మీరెక్కడికి వెళ్లాలో చెప్పే హక్కు ఆయనకు ఎక్కడ ఉంది? ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లింలను బాధపెట్టేలా చట్టం తీసుకువచ్చారంటూ ఆరోపించారు.
హిందువులకు ఓ చట్టం, ముస్లింలకు మరో చట్టమా? ఎందుకీ విభజన రాజకీయాలు? అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఈ ముస్లింలు భాగస్వాములు కాదా? అని ప్రశ్నించారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఇంత జరుగుతున్నా జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. అయితే, ఫరూక్ అబ్దుల్లా గట్టిగా ప్రశ్నించారని, టీడీపీ పార్టీ తరఫున తాను, ఇతర నేతలు కూడా గళం విప్పామని చంద్రబాబు తెలిపారు.
ముస్లింలు గోద్రా మారణకాండను మర్చిపోకూడదని, ఆ రోజున 2500 మందిని ఊచకోత కోశారని గుర్తుచేశారు. అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని డిస్మిస్ చేయమని నాటి ప్రధాని వాజ్ పేయిని కోరానని వెల్లడించారు. అప్పటినుంచి తనపై మోదీకి చాలా కోపం అని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర భవిష్యత్తుపై ఆశతో ఆయనను నమ్మితే నిలువునా వంచించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు జగన్ పై వ్యాఖ్యానిస్తూ, బీజేపీతో కలవడం ద్వారా గత ఎన్నికల్లో ఓటేసిన మైనారిటీలకు జగన్ నమ్మకద్రోహం చేశాడని మండిపడ్డారు. జగన్ నిజస్వరూపం బయటపడిందని, జగన్ నాటకాలు ఆడి బీజేపీతో చేయికలపడం ద్వారా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.