Andhra Pradesh: చంద్రబాబు ఓ గుంటనక్క, జగన్ ఓ సింహం: వాసిరెడ్డి పద్మ
- ఏపీ కోసం పోరాడింది జగన్, రాజీపడింది చంద్రబాబు
- గుంటనక్కల ముందే ఎవరైనా ఆటలాడతారు
- ఓ పెద్ద మనిషిలా కేసీఆర్ అండగా ఉండేందుకొచ్చారు
ఏపీకి నష్టం జరిగే పరిస్థితి వస్తే చంద్రబాబునాయుడులా గుడ్లు అప్పగిచ్చి జగన్ చూడరని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ రాష్ట్రం కోసం నిరంతరం పోరాడింది జగన్ మోహన్ రెడ్డి అని, రాజీపడింది చంద్రబాబునాయుడని విమర్శించారు.
చంద్రబాబు ఓ గుంటనక్క అయితే, జగన్ మోహన్ రెడ్డి ఓ సింహం అని ప్రశంసించారు. సింహం ముందు ఎవరూ జూలు విదల్చాలని చూడరని, అది మోదీ అయినా, కేసీఆర్ అయినా అని అన్నారు. గుంటనక్కల ముందే ఎవరైనా ఆటలాడతారని, అందుకే, ఏపీకి చంద్రబాబు అనే గుంటనక్క ఉంది కాబట్టే, ప్రత్యేక హోదాను ఇవ్వకుండా చేశారని అన్నారు. జగన్ పోరాట పటిమ చూసి, రేపు ఆయన సీఎం కాబోతున్నారని తెలిసే ఓ పెద్ద మనిషిలా కేసీఆర్ ఏపీ ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకొచ్చారని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తమకు మద్దతు తెలిపారని అన్నారు.
‘చంద్రబాబుకు కేసీఆర్ ఎందుకు మద్దతు తెలపలేదు? గుంటనక్క కాబట్టి? గుంట నక్కలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చోట ఎవరూ సహాయం చేయరు.ప్రధాన మంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రీ సహాయం చేయరు. చంద్రబాబు లాంటి జిత్తుల మారి నక్కలు ఉన్నప్పుడు ఏపీకి కుచ్చుటోపీ ఎలా పెడదామా? అని పక్క రాష్ట్రాలు, కేంద్రమూ చూస్తుంది. ఒక సింహం లాంటి నాయకుడు జగన్ ఉన్నాడు కనుకనే ప్రత్యేక హోదా ఇవ్వకతప్పదని కేంద్రం భయపడుతోంది. హోదా ఇవ్వక తప్పదనే పరిస్థితిని జగన్ తీసుకొస్తున్నారు కాబట్టే కేసీఆర్ బేషరతుగా మద్దతు తెలపడానికి ముందుకొస్తున్నారు. ఇది వాస్తవమైన పరిస్థితి’ అని చెప్పుకొచ్చారు.