JNU: బలవంతంగా ఇంట్లోకి చొరబడి... జేఎన్యూ వైస్ చాన్స్ లర్ భార్యను వేధించిన విద్యార్థులు!

  • సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని ఆరోపణ
  • విద్యార్థుల ముట్టడితో స్పృహ కోల్పోయిన వైస్ చాన్స్ లర్ భార్య
  • మండిపడ్డ వైస్ చాన్స్ లర్ జగదీశ్ కుమార్

తమ సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడం లేదని ఆరోపిస్తూ, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ మామిడాల జగదీశ్ కుమార్ ఇంట్లోకి రాత్రి పూట బలవంతంగా ప్రవేశించిన కొందరు విద్యార్థులు ఆయన భార్యను నిర్బంధించి వేధించారు. గడచిన వారం రోజులుగా కొందరు విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా ఎంట్రెన్స్ పరీక్షలను నిరసిస్తూ నిరాహార దీక్షలు చేస్తుండగా, వైస్ చాన్స్ లర్ పట్టించుకోవడం లేదన్నది విద్యార్థుల వాదన.

ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం జగదీశ్ కుమార్ తో మాట్లాడేందుకు విద్యార్థులు వెళ్లగా, ఆయన సమస్యలపై మాట్లాడకుండా, తమకు మిఠాయిలు పెట్టి పంపించారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. దీంతో ఆగ్రహానికి లోనైన విద్యార్థులు నిన్న సాయంత్రం కుమార్ ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోగా, భార్యను నిర్బంధించారు. ఆమె పోలీసులకు, ఇతర ప్రొఫెసర్లకు సమాచారాన్ని ఇవ్వడంతో వారు వచ్చి కాపాడారు. విద్యార్థులను చూసిన ఆందోళనలో ఆమె స్పృహతప్పి పడిపోగా, ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై జగదీశ్ కుమార్ స్పందిస్తూ, నిరసనలు తెలిపే పద్ధతి ఇదేనా? అని ప్రశ్నించారు. ఒంటరిగా మహిళ ఉంటే ఆమెను ఇంత భయభ్రాంతులకు గురి చేస్తారా? అని ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించారు.



  • Loading...

More Telugu News