Nayanatara: రాధారవి వంటివారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మగతనం అనుకుంటారు: నయనతార ఫైర్
- దేవుడు నాకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాడు
- ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు
- నా పనేదో నేను చేసుకుపోతుంటా
- రాధారవికి జన్మనిచ్చింది కూడా ఒక మహిళే
లేడీ సూపర్ స్టార్ నయనతారపై ప్రముఖ తమిళ నటుడు రాధారవి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా ఆయన వ్యాఖ్యల పట్ల నయన్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక ప్రకటనను విడుదల చేసింది. మహిళలను తక్కువ చేసి మాట్లాడటం.. అనుచిత వ్యాఖ్యలు చేయటం మగతనం అనుకుంటారని.. ఇలాంటి వారి మధ్య బతుకుతున్న ఆడవాళ్లను చూస్తుంటే జాలేస్తోందని నయన్ ఘాటుగా స్పందించింది.
ప్రేక్షకుల ప్రోత్సాహం ఉన్నంతకాలం రాధారవిలాంటి వారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారన్నారు. తనకు వృత్తిపరంగా దేవుడు ఎన్నో అవకాశాలిస్తున్నాడని.. ప్రేక్షకులు కూడా తనను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. తనపై ఎన్ని వ్యాఖ్యలు చేసినా తాను మాత్రం సీత, దేవత, దెయ్యం, స్నేహితురాలు, భార్య, ప్రేయసి పాత్రలు చేస్తూనే ఉంటానన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని నడిగర్ సంఘానికి నయన్ విన్నపం చేసింది. తాను ప్రెస్‌నోట్లు విడుదల చేయటం చాలా తక్కువని.. తన పనేదో తాను చేసుకుపోతుంటానని తెలిపింది. కానీ ఇలాంటి అంశాలు తనను స్పందించేలా చేస్తాయని తెలిపింది.
రాధారవిని పార్టీ నుంచి తొలగించినందుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలిపింది. రాధారవికి జన్మనిచ్చింది కూడా ఒక మహిళేనని, వారిని తక్కువ చేసి మాట్లాడటం మగతనం అనుకుంటారని నయన్ వ్యాఖ్యానించింది. సినిమాల్లేక ఏం చేయాలో తెలియక పాప్యులారిటీ కోసం ఇలాంటివి చేస్తుంటారని నయన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతకు ఆదర్శంగా నిలవాల్సిన రాధారవి, నీచమైన వ్యక్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆమె విమర్శించింది.