Rajath kumar: ఒక్క నిజామాబాద్ స్థానం నుంచే లోక్‌సభకు 245 నామినేషన్లు అందాయి: రజత్ కుమార్
- పవన్ వ్యాఖ్యలను పరిశీలిస్తాం
- రూ.10.09 కోట్ల నగదును సీజ్ చేశాం
- రూ.2.45 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం
- మొత్తం ఓటర్ల సంఖ్య 2.96 కోట్లకు చేరింది
తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి వరకూ మొత్తం 699 నామినేషన్లు అందితే.. వాటిలో ఒక్క నిజామాబాద్ స్థానం నుంచే 245 నామినేషన్లు అందాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. తెలంగాణ ఏమైనా పాకిస్థానా? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామని ఆయన అన్నారు.
నేడు రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికలకు మొత్తం ఓటర్ల సంఖ్య 2.96 కోట్లకు చేరిందని స్పష్టం చేశారు. రూ.2.45 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌తో పాటు రూ.2.04 కోట్ల విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకున్నట్టు రజత్ కుమార్ వెల్లడించారు. ప్రగతి భవన్లో రాజకీయ కార్యకలాపాల నిర్వహణపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఆదేశాలకనుగుణంగా టీఆర్ఎస్కు లేఖ రాసినట్టు రజత్ తెలిపారు.
నిజామాబాద్‌లో రైతుల నామినేషన్ల స్వీకరణ విషయంలో నిబంధనలు ఉల్లంఘించలేదని.. అభ్యర్థుల సంఖ్య 90 దాటితే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఒక్కో అభ్యర్థి తరుపున నలుగురు మాత్రమే నామినేషన్ల పరిశీలనకు హాజరు కావాలన్నారు. ఇప్పటి వరకూ నిర్వహించిన తనిఖీల్లో రూ.10.09 కోట్ల నగదును సీజ్ చేసినట్టు రజత్ తెలిపారు.