Chandrababu: కేసీఆర్ కు భయపడి మా బతుకుల్లో చిచ్చు పెడితే మాత్రం ఊరుకోను!: చంద్రబాబు వార్నింగ్
- హైదరాబాద్ లో ఉన్నవారు ఆరోపణలు చేస్తున్నారు
- అడ్డుపుల్లలు వేస్తే సహించేది లేదు
- నిప్పులు చెరిగిన ఏపీ సీఏం
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం మూలగుంటపాడులో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోసాని, చిన్నికృష్ణ వంటి సినీ ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు.
"నిన్న పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. వైసీపీతో పొత్తుపెట్టుకోమంటూ తనపై ఒత్తిడి తెచ్చారని పవన్ తెలిపారు. ఆయనపైనే కాదు, ఇంకొందరిపైనా ఒత్తిళ్లు వస్తున్నాయి. కొందరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. మీరు అక్కడే బతకండి, మాకేమీ బాధలేదు. మీరు అక్కడ బతకడం కోసం మాపై ఆరోపణలు చేయొద్దు, మమ్మల్ని వేధించొద్దు. మా బతుకుల్లో చిచ్చుపెట్టొద్దని వేడుకుంటున్నా. ఎంతోమంది విదేశాల్లో ఉన్నారు, మాకేం బాధలేదు. వారికి ఏదైనా సమస్య వస్తే ఆదుకుంటాం. కానీ కేసీఆర్ కు భయపడి, మీరొచ్చి ఇక్కడ అడ్డుపుల్లలు వేస్తూ మా బతుకుల్లో చిచ్చు పెడితేమాత్రం తన, మన చూసుకునేది లేదు" అంటూ చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు
"రాష్ట్రం అభివృద్ది జరుగుతున్న తీరు చూసి భరించలేక జగన్ తో కలిసి కుట్రలు పన్నుతున్నారు. మరో పదేళ్లలో తెలంగాణ కంటే మించిపోతామని భయపడిపోయి పిరికితనంతో మనపై దాడులు చేస్తున్నారు, పోలవరం వద్దనడానికి కేసీఆర్ ఎవరు? పోలవరం మన హక్కు" అంటూ మండిపడ్డారు.
"ఈ గడ్డపై పుట్టిన ఏ వ్యక్తి అయినా, ఈ గడ్డ గాలి పీల్చిన ఏ వ్యక్తయినా, ఈ గడ్డపై నీళ్లు తాగిన ఏ వ్యక్తయినా, ఈ ప్రాంతాభివృద్ధి కోసమే ఆలోచించాలి. అలా కాకుండా లోటస్ పాండ్ లో కూర్చుని కేసీఆర్ కు కాల్మొక్తా నీ బాంచన్ అంటే వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నా. ఆంధ్రా వాళ్ల పెత్తనం వద్దని అన్న పెద్దమనిషి మాపై ఎందుకు పెత్తనం చేయాలి?" అంటూ నిప్పులు చెరిగారు.