India: రాఫెల్ విమానం వస్తే పాక్ దళాలు ఎల్వోసీ సమీపంలోకి రావాలన్నా జడుసుకుంటాయి: ఐఏఎఫ్ చీఫ్
- వాయుసేన సామర్థ్యం రెట్టింపవుతుంది
- పాక్ వద్ద జవాబుండదు
- 'రాఫెల్ ది బెస్ట్' అంటున్న బీఎస్ ధనోవా
దేశంలో రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం ఓ స్కాం అంటూ తీవ్ర ప్రకంపనలు రేగుతున్న తరుణంలో ఆ విమానం అత్యుత్తమమైనదని, దాని సామర్థ్యం అమేయమని అంటున్నారు భారత వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా. రాఫెల్ జెట్ ఫైటర్ భారత వాయుసేనలో చేరితే, పాకిస్థాన్ దళాలు నియంత్రణ రేఖ సమీపంలోకి రావాలన్నా వణికిపోతాయని చెప్పారు. అమెరికా తయారీ చినూక్ పోరాట హెలికాప్టర్లు భారత వైమానిక దళంలో చేరిక సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ యుద్ధవిమానం అన్ని రకాల పరిస్థితుల్లో పోరాటానికి అనువైనదని, ఒక్క రాఫెల్ విమానం ఉన్నా ప్రత్యర్థిపై పైచేయి సాధించవచ్చని వివరించారు. రాఫెల్ చేరికతో భారత వాయుసేన సామర్థ్యం రెట్టింపవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ వద్ద రాఫెల్ కు దీటైన విమానమే లేదని ధనోవా అన్నారు.
భారత్ వద్ద ప్రస్తుతం రష్యా తయారీ సుఖోయ్, మిగ్ విమానాలతో పాటు ఫ్రెంచ్ తయారీ మిరేజ్ విమానాలు మాత్రమే ఉన్నాయి. వీటికి రాఫెల్ కూడా తోడైతే ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక దళాల్లో భారత్ కూడా ముందువరుసలో ఉంటుంది. ఇప్పటికే ఐఏఎఫ్ పైలట్లకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పోరాడతారన్న మంచి గుర్తింపు ఉంది. మొన్నటి అభినందన్ ఉదంతంతో ఆ పేరు మరింత ఇనుమడించింది. అభినందన్ మిగ్ బైసన్ వంటి మధ్యశ్రేణి విమానం నడుపుతూ కూడా ఎంతో ఆధునికమైన అమెరికా తయారీ ఎఫ్-16ని కూల్చివేశాడు. రాఫెల్ విమానం టెక్నాలజీ పరంగా ఎఫ్-16 కన్నా కొన్ని తరాల ముందుంటుంది.