Andhra Pradesh: కేసీఆర్ రూ.1000 కోట్ల గిఫ్ట్ ఆరోపణల వ్యవహారం.. చంద్రబాబు, పవన్ విమర్శలకు తొలిసారి కౌంటర్ ఇచ్చిన జగన్!
- కేసీఆర్ హోదాకు మద్దతిస్తే బాబుకు అభ్యంతరం ఏంటి?
- వెయ్యి కోట్లు ఇచ్చినట్లు బాబు చూశారా?
- అమ్ముడుపోయిన మీడియా మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంది
- తాడిపత్రిలో అధికార పార్టీపై విరుచుకుపడ్డ వైసీపీ అధినేత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడికి అభ్యంతరం ఏంటని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈరోజు జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. కేసీఆర్ ప్రత్యేకహోదాకు మద్దతు ఇస్తున్నారనీ, వైసీపీకి కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ జగన్ కు రూ.1,000 కోట్లు పంపాడని సీఎం చంద్రబాబు విమర్శలు చేయడంపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేసీఆర్ తనకు రూ.1,000 కోట్లు ఇచ్చారని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘అయ్యా చంద్రబాబూ.. కేసీఆర్ నాకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చినట్లు మీరు చూశారా? లేక కేసీఆర్ మీకు ఫోన్ చేసి చంద్రబాబూ.. చంద్రబాబూ.. నేను జగన్ కు వెయ్యి కోట్లు పంపించా అని చెప్పాడా?’ అని నిలదీశారు. చంద్రబాబు పార్టనర్, యాక్టర్ పవన్ కల్యాణ్ కూడా ఇదే భాషను మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ యాక్టర్ గత ఐదేళ్లలో కేసీఆర్ ను ఎన్నిసార్లు పొగిడారో గుర్తుచేసుకోవాలని సూచించారు.
చంద్రబాబు యెల్లో మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఇతర అమ్ముడుపోయిన మీడియా వైసీపీని లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. ‘వీరంతా రోజంతా ‘జగన్.. జగన్.. జగన్.. జగన్ అని అంటున్నారు. వీళ్ల బాధలు చూస్తుంటే నాకు నిజంగా నవ్వాలనిపించింది. పండ్లు ఉండే చెట్టుమీదనే రాళ్లు పడతాయి. గెలుస్తుందన్న పార్టీ మీదనే విమర్శలు వస్తున్నాయి. జనం మన వెంట ఉన్నారు కాబట్టే కుట్రలు పన్నుతున్నారు. జగన్.. జగన్.. జగన్ అని కలవరిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు.
సిగ్గులేకుండా, వయసుకు గౌరవం లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకే చెల్లుబాటు అవుతుందని విమర్శించారు. ప్రత్యేకహోదాకు వేరే రాష్ట్రాలు మద్దతు ఇస్తుంటే చంద్రబాబుకున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ‘హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని పొత్తు కోసం టీఆర్ఎస్ తో బేరాలు చేయడం సబబేనా చంద్రబాబు ? నీతో పొత్తు పెట్టుకుంటే వాళ్లు మంచివాళ్లు, మీరూ మంచివాళ్లు. పొత్తు పెట్టుకోకుంటే వాళ్లంతా అన్యాయస్తులు, దుర్మార్గులు అని ఎలా అంటావ్ చంద్రబాబూ?’ అని నిలదీశారు.