Revanth Reddy: విపక్షం గెలిస్తేనే టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల గౌరవం పెరుగుతుంది: రేవంత్‌రెడ్డి సెటైర్
- అంతవరకు ప్రగతి భవన్ గేట్లు కూడా తెరుచుకోవడం కష్టం
- కేసీఆర్ వచ్చాక హైదరాబాద్ ఇమేజ్ పడిపోయింది
- ఉదయం వాకింగ్‌లో ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల గౌరవం పెరగాలంటే విపక్ష పార్టీ అభ్యర్థులు రాష్ట్రంలో గెలవాల్సిన తక్షణావసరం ఉందని మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. ఈరోజు ఉదయం కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువుకట్టపై వాకింగ్ చేస్తూ రేవంత్‌రెడ్డి వాకర్స్‌ను కలిశారు. తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. మినీ భారత్ అయిన మల్కాజ్‌గిరి అభివృద్ధి చెందాలంటే ఇక్కడి గొంతు పార్లమెంటులో వినిపించేవారు కావాలని అన్నారు. అందువల్ల తనకు మద్దతు పలకాలని కోరారు.
అనంతరం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల పరిస్థితి భిన్నంగా ఉందని, ప్రగతిభవన్ గేట్లు తెరుచుకోవడమే కష్టంగా ఉందని అన్నారు. ప్రతిపక్షం గెలిస్తేనే ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకుంటాయన్నారు. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా పడిపోయిందని విమర్శించారు.