India: గర్జించిన భారత సైన్యం.. సరిహద్దు వెంబడి 12 మంది పాక్ జవాన్ల హతం.. బెంబేలెత్తిపోయిన పాక్!
- నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు
- భారత్ ఎదురుకాల్పులతో వణికిన పాక్ సైన్యం
- కాల్పులు ఆపాలంటూ జెండా తలకిందులు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దులో యథేచ్ఛగా కాల్పులకు తెగబడుతున్న పాక్ సైన్యానికి భారత భద్రతా దళాలు బుద్ధి చెప్పాయి. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ వద్ద పాక్ గత మూడు రోజులుగా కాల్పులకు తెగబడుతోంది. దీంతో ఎదురు కాల్పులు ప్రారంభించిన భారత్ 12 మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. భారత్ కాల్పుల్లో మరో 22 మంది పాక్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
పాక్ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. ముగ్గురు పౌరులు గాయపడ్డారు. భారత సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించడంతో పాక్ సైన్యం వణికిపోయింది. తమ జాతీయ జెండాలను తలకిందులు చేసి ఓటమిని అంగీకరించింది. కాల్పులు ఆపాలంటూ పరోక్షంగా సంకేతాలు పంపడంతో భారత సైన్యం కాల్పులు ఆపింది. భారత కాల్పుల్లో గాయపడిన వారిని పాక్ సైన్యం హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించింది.