vinjamuri anasuyadevi: దివికేగిన సంగీత సరస్వతి... తుదిశ్వాస విడిచిన వింజమూరి అనసూయాదేవి!
- అమెరికాలోని హ్యూస్టన్‌లో తుదిశ్వాస
- ఈమె ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు
- ‘జయజయజయ ప్రియభారత’ పాటకు బాణీకట్టిన దేవి
సంగీత స్వరం మూగబోయింది. ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయాదేవి అమెరికాలోని హ్యూస్టన్‌లో కన్నుమూశారు. జానపద కళాకారిణిగా, సంగీత దర్శకురాలిగా, రచయితగా, హార్మోనియం వాద్య కళాకారిణిగా ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి.
గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అనసూయాదేవి హ్యూస్టన్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 99 సంవత్సరాలు. 1920 మే 12న కాకినాడలో జన్మించిన అనసూయాదేవి ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రికి స్వయానా మేనకోడలు. ప్రముఖ గాయని వింజమూరి సీతాదేవికి సోదరి. ఆలిండియా రేడియోలో తెలుగు జానపద గీతాలకు విశేష ప్రాముఖ్యం కల్పించిన సంగీత సరస్వతి అనసూయాదేవి.
తన ఎనిమిదో ఏటనే పాటకు బాణీకట్టి బాల మేధావిగా గుర్తింపు పొందారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ‘జయ జయ జయ ప్రియభారత’ పాటకు బాణీకట్టింది అనసూయనే. తెలుగులో ‘బంగారుపాప, అగ్గిరాముడు, కనకదుర్గ మహత్యం, పెంకిపెళ్లాం, ఒక ఊరి కథ’, తమిళంలో ‘వంజికోట, వాలిబన్’ చిత్రాలకు ఆమె సంగీతం అందించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి దేశనాయకుల ముందు గొంతు వినిపించిన ఘనాపాటి అనసూయాదేవి.
వింజమూరి ఆలపించిన ‘మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో...’ జానపద గీతం ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తుంది. ఆమె సేవలను గుర్తించిన ఆంధ్రవిశ్వవిద్యాలయం 1977లో గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి సత్కరించింది. అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని, పారిస్‌లో ‘క్వీన్ ఆఫ్ ఫోక్’ బిరుదును అందుకున్నారు. భావగీతాలు, జానపద గేయాలతో రెండు పుస్తకాలు విడుదల చేశారు.
జానపద సంగీతంపై అనసూయాదేవి ఏడు పుస్తకాలు రాశారు. వింజమూరికి ఐదుగురు సంతానం. అనసూయాదేవి మృతికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని, దేశభక్తి గీతాలు, జానపద గీతాలాపనతో కళామతల్లికి సేవ చేశారని కొనియాడారు.