Pawan Kalyan: నేను ముఖ్యమంత్రిని అయితే తొలి సంతకం ఆ ఫైలు పైనే: పవన్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-ebd81167a3e4d55de258bdc74963d4fbd08f7ab1.jpg)
- జగన్, చంద్రబాబు కుటుంబాలే రాష్ట్రాన్ని ఏలాలా?
- 60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.5 వేల పింఛన్
- ఆడపడుచులకు నెలకు రూ.2500
- పవన్ వరాల జల్లు
ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలోని కైకలూరు, బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డలలో పర్యటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. తాను అధికారంలోకి వస్తే 60 ఏళ్లు నిండిన ప్రతీ రైతుకు నెలకు రూ.5 వేల పింఛను ఇస్తానని, తన తొలి సంతకం ఆ ఫైలు మీదేనని పేర్కొన్నారు. నాణ్యమైన సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రతీ అడపడుచుకు రూ. 2500 నుంచి రూ.3500 ఇస్తానని, తన రెండో సంతకం ఈ ఫైలు మీదేనని పవన్ హామీ ఇచ్చారు. యువతకు మూడు లక్షల ఉద్యోగాలు కల్పించే ఫైల్‌పై మూడో సంతకం చేస్తానని స్పష్టం చేశారు.
రౌడీలు, గూండాలు చట్టసభల్లో ప్రవేశిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ ప్రజా సమస్యలపై పోరాడే నిజమైన నాయకులు చట్టసభల్లో కనిపించడం లేదన్నారు. తాను ఎవరికీ భయపడనని, తన జోలికి వస్తే తాటతీస్తానని హెచ్చరించారు. పులివెందుల నుంచి వచ్చిన జగన్, కుప్పం నుంచి వచ్చిన చంద్రబాబు కుటుంబాలే రాష్ట్రాన్ని ఏలాలా? మిగిలినవారు రాజకీయాలకు పనికిరారా? అని పవన్ ప్రశ్నించారు.