Election commission: నేటి మధ్యాహ్నంతో ముగియనున్న తొలి దశ నామినేషన్ల పర్వం.. తెలంగాణలో ఇప్పటి వరకు 220 దాఖలు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-68e6aa06fd04726fd274a08dd47259abc56d6d79.jpg)
- రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన
- 28న మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణ గడువు
- గడువు ముగిసిన అనంతరం అభ్యర్థుల ప్రకటన
నేటి మధ్యాహ్నం మూడు గంటలకు తొలి దశ నామినేషన్ల పర్వం ముగియనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఆదివారం వరకు మొత్తం 220 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్‌లో కవితకు వ్యతిరేకంగా బరిలోకి దిగాలన్న నిర్ణయంతో 50 మంది రైతులు నామినేషన్ వేశారు. ఇక, నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసే వారితో ఆయా కార్యాలయాలు పోటెత్తుతాయని భావిస్తున్నారు.
మంగళవారం నుంచి అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. 28వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా, అసంపూర్తిగా ఉన్న నామినేషన్లను అధికారులు తిరస్కరిస్తారు. ఉపసంహరణ గడువు ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు.