Revanth Reddy: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ను నమ్మేదెవరు?: రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
- జాతీయనేతలు కేసీఆర్ తో కలవరు
- 16 సీట్లతో కేసీఆర్ ఏంచేస్తారు?
- కాంగ్రెస్ కు 150 స్థానాలు గ్యారంటీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న ఆయన సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లో ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో ముఖ్యనేతలు ఎవరూ కేసీఆర్ తో కలిసిరారని అన్నారు. ఢిల్లీలో ఆయన విశ్వసనీయత ఏపాటిదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
"కాంగ్రెస్ 150 సీట్లు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. 150 సీట్లుగెలిచే వాళ్లకు ఓటేస్తే వృథా అవుతుందన్నప్పుడు 16 సీట్లు వచ్చేవాళ్లకు ఎలా ఓటేస్తారు? ఆ 16 సీట్లు ఉండి ఐదేళ్ల పాటు కేసీఆర్ ఏమీచేయలేడు. నాయకుడన్నవాడు గెలుపోటములతో పనిలేకుండా ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడైనా గానీ ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. ఇప్పుడు ప్రజల తరఫున నిలబడాలని పార్టీ ఆదేశించింది. అందుకే మల్కాజ్ గిరిలో పోటీచేస్తున్నాను. ఇవి దేశప్రధానిని నిర్ణయించే ఎన్నికలు" అంటూ వ్యాఖ్యానించారు.