Telangana: మల్లాపూర్ చక్కెర కర్మాగారాన్ని మూసేశారు.. టీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెబుతారు!: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
- పసుపుబోర్డు విషయంలో మాటతప్పారు
- రోళ్లవాగు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచలేదు
- జగిత్యాలలో మీడియాతో కాంగ్రెస్ నేత
మల్లాపూర్ చక్కెర కర్మాగారాన్ని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రభుత్వపరం చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ కర్మాగారాన్ని స్వాధీనం చేసుకోకుండా మూసివేయించిందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం మాటతప్పిందని దుయ్యబట్టారు. పసుపు పంట క్వింటాల్‌కు రూ.2 వేలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశాననీ, అయినా పట్టించుకోలేదన్నారు. జగిత్యాలలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.
గత ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని జీవన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయానికి బడ్జెట్ లో రూ.800 కోట్లు కేటాయించినా, కనీసం 8 రూపాయలు కూడా ఖర్చు చేయడం లేదని ఎద్దేవా చేశారు. సమైక్య రాష్ట్రంలో పసుపు క్వింటాల్‌కు రూ.1500 ఇచ్చేవారని గుర్తుచేశారు. రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా 0.25 టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టును 1 టీఎంసీకి పెంచుతామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.