Andhra Pradesh: ఏపీలో గెలిపిస్తే అన్నిరకాల అప్పులను మాఫీ చేస్తా.. ప్రపంచంలో 250 కోట్ల మంది నా ఫాలోవర్లే!: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్
- ప్రతీనియోజకవర్గానికి రూ.100 కోట్లు కేటాయిస్తాం
- జిల్లాకు 5-10 కంపెనీలను కేటాయిస్తాం
- విజయవాడలో మీడియాతో మాట్లాడిన నేత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ప్రకటించారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాగానే, డ్వాక్రా, రైతులకు అన్నిరకాల రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. అలాగే ప్రతీనియోజకవర్గానికి రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఏపీలోని 35 లక్షల మంది నిరుద్యోగులకు భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నేతలతో కలిసి పాల్ మాట్లాడారు.
అలాగే విజయవాడను హైదరాబాద్ కంటే మెరుగైన స్మార్ట్ సిటీగా చేస్తామని కేఏ పాల్ తెలిపారు. తిరుపతి, విశాఖ సహా ప్రతి జిల్లా కేంద్రంలో 5-10 కంపెనీలు పెడతామనీ, జిల్లాకు కనీసం లక్ష ఉద్యోగాలు తెస్తామని అన్నారు. తనకు దేవుడి కృప ఉందని పాల్ చెప్పారు. తాను నోరు విప్పి మాట్లాడితే నిమిషానికి రూ.కోటి వస్తాయని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా తనకు 250 కోట్ల మంది అనుచరులు ఉన్నారని పేర్కొన్నారు. తాను ఏడు సార్లు యుద్ధాన్ని ఆపాననీ, 17 సార్లు తన పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేశారని గుర్తుచేశారు. తాను పదో తరగతి ఫెయిల్ అయ్యానని అన్నారు.