India: లాటరీలో తగిలిన రూ.5 కోట్ల విలువైన ఫ్లాట్.. వాస్తు బాగాలేదని వదులుకున్న ముంబయి వాసి
- లాటరీలో రెండు ఫ్లాట్లు
- వాస్తు సరిగాలేదంటూ ఆందోళన
- ఒక ఫ్లాట్ వదులుకున్న వైనం
వాస్తు సిద్ధాంతాలపై నమ్మకం చూపించేవాళ్లు దేశంలో కోకొల్లలు. వాస్తు సరిగా లేకపోతే తమ జీవితాలు కూడా సక్రమంగా ఉండవని భావిస్తారు. అందుకే వాస్తు కోసం ఎంత ఖర్చయినా పెట్టేందుకు వెనుకాడరు. అయితే, ఊరికే వచ్చిన కోట్ల విలువైన ఫ్లాట్ ను కూడా వాస్తు బాగాలేదని వదులుకునేవాళ్లను ఏమనాలి! ముంబయిలో బీఎంసీ డివిజన్ శివసేన నాయకుడు వినోద్ షిర్కే మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ నిర్వహించిన లాటరీలో రెండు ఫ్లాట్లు గెలుచుకున్నాడు. ఈ రెండూ ఫ్లాట్లు కోట్ల విలువ పలుకుతాయి. వాటిలో ఒకదాని విలువ రూ.4.99 కోట్లు కాగా, మరో ఫ్లాట్ రూ.5.8 కోట్లు.
అయితే, రూ.5.8 కోట్ల విలువైన ఫ్లాట్ ను తన వాస్తు గురువుకు చూపించిన వినోద్ షిర్కే ప్రతికూల సమాధానం విన్నాడు. ఆ ఫ్లాట్ కు వాస్తు బాగాలేదని, దాన్ని వదులుకోవడమే మంచిదని ఆ వాస్తు నిపుణుడు సూచించాడట. దాంతో, కోట్లు విలువ చేసే ఆ ఖరీదైన ఫ్లాట్ ను మరేమీ ఆలోచించకుండా వదులుకున్నాడు. భారీ ఫ్లాట్ కావడంతో ఇప్పుడు దాన్ని మళ్లీ పునర్మించడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని, అందుకే దాన్ని వదులుకున్నట్టు షిర్కే చెప్పాడు. దాంతో చేసేది లేక వెయిటింగ్ లిస్ట్ లో షిర్కే తర్వాత ఉన్న మరో వ్యక్తికి ఆ ఫ్లాట్ తాళాలు అందించాలని బీఎంసీ అధికారులు నిర్ణయించారు.