Andhra Pradesh: రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే కేసీఆర్ ఏపీలో పోటీ చేయాలి: పవన్ కల్యాణ్
- ఏపీలో వైసీపీ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టే
- వైసీపీ గెలిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే
- ప్రతిపక్ష నేతగా జగన్ ఏం సాధించారు?
తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ పై జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడుతూ, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే కేసీఆర్ ఏపీకి వచ్చి పోటీ చేయాలని అన్నారు. ఏపీలో వైసీపీ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టేనని వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీ గెలిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టేనని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఏం సాధించ లేని జగన్, ఇక, ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు? అని ప్రశ్నించారు.
‘నూజివీడును ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుద్దాం. అంతర్జాతీయ మామిడి పండగ చేద్దాం’ అని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. స్పెయిన్ లో టమాట పండగలా, నూజివీడు అంటే మామిడి పళ్ల పండగ గుర్తుకురావాలని అన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి అధికారంలోకొస్తే, ప్రభుత్వ పథకాలకు తన పేరు పెట్టనని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకు డొక్కా సీతమ్మ, కందుకూరు, కాటన్ దొర పేర్లు పెడతానని అన్నారు.