Narendra Modi: ప్రధాని మోదీపై రైతుల ‘పోటీ’ దండయాత్ర!
- నామినేషన్ వేయనున్న 111 మంది రైతులు
- రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకణ్ణు ప్రకటన
- ఎన్నికలనే ఆయుధంగా మలచుకోనున్నట్లు వెల్లడి
ప్రధాని పోటీ చేయనున్న వారణాసి నియోజకవర్గంలో ఈసారి భారీ పోటీ నెలకొంటోంది. రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా భారీ సంఖ్యలో రైతుల్ని పోటీకి దించాలని దక్షిణాది నదుల అనుసంధాన పథకం రైతు సంఘం తెలిపింది. మోదీపై 111 మంది తమిళ రైతుల్ని బరిలో దించుతున్నట్లు సంఘం అధ్యక్షుడు అయ్యాకణ్ణు ప్రకటించారు.
సమస్యల పరిష్కారం కోరుతూ అయ్యాకన్ను నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గతంలో 15 రోజులపాటు రైతులు ఆందోళనను కొనసాగించిన విషయం తెలిసిందే. కావేరీ వ్యవహారం, పంట రుణాల సమస్య, ఆత్మహత్యకు పాల్పడిన రైతులను ఆదుకోవాలంటూ అప్పట్లో రైతులు ఆరుబయటే వంటావార్పూ చేసుకుంటూ తమ నిరసన తెలియజేశారు. తాజాగా ప్రధాని మోదీ దేశంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయనపై నామినేషన్ వేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించినట్లు అయ్యాకణ్ణు ప్రకటించారు.