Andhra Pradesh: ఆంధ్రా ప్రాంతంవారి భూములపై పడుతున్నారు.. ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తున్నారు!: సీఎం చంద్రబాబు ఆగ్రహం
- జగన్ రాష్ట్రంలోనే అతిపెద్ద అఫిడవిట్ ఇచ్చారు
- ఇన్ని నేరాలతో ఎవ్వరూ ఇలాంటి అఫిడవిట్ ఇవ్వలేదు
- మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఎంత కోపం చూపారో ఇప్పుడు వైసీపీ విషయంలోనూ అదే భావనతో ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ వాదాన్ని ఏపీ ప్రజలపై రుద్దుతూ ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రా ప్రాంతంవారి భూములపై పడుతూ దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశాడని వ్యాఖ్యానించారు. 31 కేసులు, ఇన్ని నేరాలతో ఇప్పటివరకూ ఎవ్వరూ ఇంతపెద్ద అఫిడవిట్ దాఖలు చేయలేదని ఎద్దేవా చేశారు. జగన్ ఒత్తిడి చేయడంతో వైఎస్ వివేకానందరెడ్డి మరణాన్ని ఆయన కుమార్తె సునీత రాజకీయం చేసే పరిస్థితి నెలకొందని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధితో రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం ఉరకలేస్తోందన్నారు. ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.