Telangana: సీఎం కేసీఆర్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం: కుంతియా
- ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారు
- ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో నిరసనలు చేపడతాం
- కేంద్రంలో కేసీఆర్ పాత్ర ఉండబోదు
తెలంగాణలోని అన్ని లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, కేంద్రంలో చక్రం తిప్పుతామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై టీ-కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా సెటైర్లు విసిరారు. కేంద్రంలో కేసీఆర్ పాత్ర ఉండబోదని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేతలపై ఆయన నిప్పులు చెరిగారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని విమర్శించారు. రేపు గవర్నర్ నరసింహన్ ను కలిసి సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో నిరసనలు చేపడతామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన వాళ్లు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించిన నేతలు, ఇప్పుడు తమ పార్టీ వీడాక వారి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు కేసీఆర్, కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని, రాహుల్ గాంధీ, ఎన్డీఏ మధ్య జరిగేవిగా అభివర్ణించారు. తెలంగాణ పీసీసీలో ఇప్పట్లో మార్పు ఉండదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే ఈ ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.