West Godavari District: నన్ను భీమవరం ఎమ్మెల్యేని చేయండి..అంతర్జాతీయ నగరంగా చేస్తా: పవన్ కల్యాణ్
- భీమవరంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కల్యాణ్
- ఈ నగరాన్ని విశ్వనగరంగా తయారు చేస్తా
- ఇక్కడి ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారు..సమస్యలు పరిష్కరించలేదు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో భీమవరంలోని తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు, భీమవరంలోని నిర్మలాదేవీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పవన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ఏం చేశారో తనకు తెలియదని, తనను భీమవరం ఎమ్మెల్యేని చేస్తే, దీన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానని, భీమవరాన్ని విశ్వనగరంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించుకున్నారు గానీ, ఇక్కడి డంపింగ్ యార్డు తరలించలేకపోయారని, యనమదురు డ్రెయిన్ సమస్యను తీర్చలేకపోయారని విమర్శించారు.