Delhi: ముఖ్యమంత్రే స్వయంగా కేసును తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు: వైఎస్ సునీత
- నా తండ్రి హత్య కేసు దర్యాప్తు విధానం సరిగా లేదు
- మా వాళ్లనే దోషులుగా చూపిస్తారేమో!
- మా అన్నే నా తండ్రిని చంపారన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు!
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కు కూతురు సునీతారెడ్డి విన్నవించారు. అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన తండ్రి హత్య ఘటనపై జరుగుతున్న దర్యాప్తు విధానం సరిగా లేదని, ముఖ్యమంత్రే స్వయంగా ఈ కేసును తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఈ కేసులో తమ వాళ్లనే దోషులుగా చూపిస్తారేమోనని భయంగా ఉందని, తన అన్నే తన తండ్రిని చంపారన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు రిపోర్ట్ చేసే సంస్థ కాకుండా మరే ఇతర దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించాలని కోరినట్టు చెప్పారు. సీబీఐ లేదా మరేదైనా సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరానని, కేంద్ర హోం శాఖను కలవమని సీఈసీ తనకు తెలిపినట్టు చెప్పారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కూడా కలుస్తానని అన్నారు. ఈ కేసు విషయమై విజయవాడ కోర్టులో తన తల్లి పిటిషన్ దాఖలు చేస్తారని సునీత చెప్పారు.