shivaji: కేసీఆర్ ఫాంహౌస్ లో రూ. 100 కోట్లు ఉన్నాయని చెబితే.. 100 నిమిషాల్లో సోదాలు చేయాలట, ఏమిటిది?: సినీ నటుడు శివాజీ ఫైర్
- ఆధారాలతో డబ్బు తీసుకెళ్తున్నా.. సీజ్ చేస్తున్నారు
- డబ్బు ఉందని చెబితే.. 100 నిమిషాల్లో రెయిడ్ చేయాలట
- ఏపీలో మాత్రమే ఇలా జరుగుతోంది
బ్యాంకుల నుంచి తగిన ఆధారాలతో డబ్బులు తీసుకెళ్తున్నా... సీజ్ చేస్తున్నారని సినీ నటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ, జీఎస్టీ దాడులతో బెంబేలెత్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడులు తమ పరిధిలో లేవని, కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయని ద్వివేదీ తనకు చెప్పారని అన్నారు. ఎవరివద్దైనా డబ్బు ఉందనే సమాచారం ఎవరి నుంచి అందినా... వెంటనే దాడులు జరుగుతాయని చెప్పారని తెలిపారు.
'తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో రూ. 100 కోట్లు ఉన్నాయిని ఒకవేళ నేను 'సీవిజిల్'కి ఫిర్యాదు చేస్తే... 100 నిమిషాల్లో అక్కడకు వెళ్లి, వారి ఫాంహౌస్ లో సోదాలు చేయాలట. చంద్రబాబు ఇంట్లో రూ. 1000 కోట్లు ఉన్నాయంటే చెక్ చేయాలట. జగన్ ఇంట్లో రూ. 2000 కోట్లు ఉన్నాయంటే సోదా చేయాలట. ఈ పరిస్థితి ఏపీలో తప్ప మరే రాష్ట్రంలో లేదు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి రెయిడ్స్ లేవు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి దీనితో సంబంధం లేదు. ఈ విషయాన్ని నాకు ఎన్నికల సంఘమే చెప్పింది. ఏపీలో అలజడి సృష్టించేందుకే ఇలాంటివి చేస్తున్నారు' అని చెప్పారు.
ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఐటీ, జీఎస్టీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. సరైన ఆధారాలు ఉన్నవారి డబ్బును కూడా సీజ్ చేయడం సరైంది కాదని అన్నారు. జగన్ ఇంట్లో కోట్ల డబ్బు ఉందని తాను ఫిర్యాదు చేస్తే, దాడులు చేసేస్తారా? ఇక ఏమీ ఆలోచించరా? అని ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఒక వర్గంపై పనిగట్టుకుని ఐటీ, జీఎస్టీ దాడులు చేస్తున్నారని విమర్శించారు.