saudi arabia: సౌదీ అరేబియా నుంచి కేరళకు యువకుడి శవానికి బదులుగా యువతి శవం!
- సౌదీలో గుండెపోటుతో మరణించిన రఫీక్
- కేరళ చేరుకున్న భౌతికకాయం
- శవాన్ని తరలించడంలో పొరపాటు
ఎంతో ఆవేదనతో శవపేటికను తెరిచిన బంధుమిత్రులు షాక్ కు గురయ్యారు. యువకుడి శవం స్థానంలో మరో శవం ఉండటమే దీనికి కారణం. వివరాల్లోకి వెళ్తే, కేరళలోని తిరువనంతపురానికి దగ్గర్లో ఉండే రఫీక్ అనే 28 ఏళ్ల యువకుడు సౌదీఅరేబియాలో పని చేస్తున్నాడు. అక్కడే గత నెలలో గుండెపోటుతో మరణించాడు. శవాన్ని స్వదేశానికి పంపే ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక... మృతదేహాన్ని పార్సిల్ ద్వారా కేరళకు పంపారు. శవపేటికను తెరిచి చూస్తూ... రఫీక్ శవం బదులు... అందులో ఓ యువతి శవం ఉంది. షాక్ కు గురైన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ, శవపేటికలో ఉన్న యువతిని శ్రీలంకకు చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. శవాన్ని తరలించడంలో పొరపాటు జరిగిందని అన్నారు. శవ పేటికను వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం యువతి శవాన్ని కొట్టాయంలోని మార్చురీలో భద్రపరిచారు.