Chandrababu: సాలూరులో రోడ్ షో: జగన్, కేసీఆర్ లపై విరుచుకుపడ్డ చంద్రబాబు
- వివేకా హత్యకేసులో నాటకాలాడారు
- జగన్ ను చూస్తే పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారు
- జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు వేసినట్టేనన్న బాబు
విజయనగరం జిల్లా సాలూరులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత జగన్ పైనా, తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. చిన్న కోడికత్తికి అంత పెద్ద దర్యాప్తు కోరారంటూ మొదట జగన్ ను ఎద్దేవా చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ ఎన్ఐఏ విచారణ కావాలన్నారని విమర్శించారు.
ఇప్పుడు వివేకా హత్యకేసులోనూ గుండెపోటు అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ జీవితంలో ఎప్పుడూ కేసులేనని, ఆయనతో కలిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారని, జగన్ వాటాలు అడుగుతారని ముందే హడలిపోతున్నారని వ్యాఖ్యానించారు. తనను చూస్తే పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని, అదే జగన్ ను చూస్తే పారిపోతారని సెటైర్ వేశారు.
ఇప్పుడు జగన్ ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ ఆంధ్రాలో రాజకీయాలు చేయాలని చూస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. తమ పార్టీ తరఫున గెలిచిన నాయకులందరినీ లాగేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సిద్ధాంతాన్ని ఏపీలోనూ అమలు చేయాలని భావిస్తున్నాడని, అందుకు జగన్ జతకలిశాడని విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రంపై కక్షగట్టి అణగదొక్కాలని చూస్తున్నాడని, జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు ఓటేసినట్టేనని స్పష్టం చేశారు.
ఇక వీరిద్దరికీ కాపలాదారు ప్రధాని మోదీ అని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వీరికి అసూయ అని, అందుకే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. "ఏం తమ్ముళ్లూ ఇవన్నీ చూస్తున్నా పౌరుషం రావడంలేదా? రోషం ఉందా? లేదా? తెలంగాణపై కోపం వస్తోందా? లేదా? కేసీఆర్ పై కసి పెరుగుతోందా? లేదా? ఏం, మనం మనుషులం కాదా? 60 ఏళ్ల మన కష్టాన్ని అప్పనంగా దోచుకుతిన్నారు" అంటూ రోడ్ షోకు హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు.