Andhra Pradesh: ‘పొట్లూరి’ వ్యాఖ్యలపై చంద్రబాబు గుస్సా.. హోదా బోరింగ్ సబ్జెక్టా? అంటూ మండిపాటు!
- జగన్ తో ఏపీలో లక్ష ఎకరాలు దుర్వినియోగం
- వివేకా హత్య కేసులో డ్రామాలమీద డ్రామాలు చేస్తున్నారు
- జగన్ కుట్రలకు, డ్రామాలకు అంతేలేకుండా పోయింది
ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్టు అని వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ నిర్వాకం వల్లే ఏపీలో లక్ష ఎకరాలు నిరుపయోగంగా మారాయని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా అన్నది వైసీపీ నేతలకు బోరింగ్ సబ్జెక్టుగా కనిపిస్తోందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను లోక్ సభ సభ్యులుగా గెలిపిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు.
వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించి 28,000 ఎకరాలు, లేపాక్షిలో మరో 8,808 ఎకరాలు, బ్రాహ్మణీ స్టీల్స్ కేసులో మరో 10,000 ఎకరాలు జగన్ వల్ల కేసుల్లో చిక్కుకుని నిరుపయోగంగా ఉండిపోయాయని చంద్రబాబు తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ నేతలు డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ డేటా చోరీకి భారీ కుట్ర చేశారనీ, ఫామ్-7 ద్వారా దాదాపు తొమ్మిది లక్షల ఓట్లను తొలగించేందుకు మరో కుట్ర చేశారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత జగన్ కుట్రలు, డ్రామాలకు అంతేలేకుండా పోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. మోదీ మేలు కోసమే వైసీపీ లోక్ సభ సభ్యులు రాజీనామాలు సమర్పించారని పేర్కొన్నారు. ఎన్నికలు రాకుండా చూసి రాజీడ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.