Andhra Pradesh: జగన్ కు 25 సంవత్సరాల విజన్ ఉంది.. ఐదేళ్ల కోసం ఆయన నవరత్నాలను ప్రకటించారు!: పొట్లూరి వరప్రసాద్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-374bbd4bb61e87cbc4dfbfc6be085df21e2c2037.jpg)
- జగన్ లాంటి నేత వల్లే అభివృద్ధి సాధ్యం
- ఈ మూడు వారాలు యుద్ధంలాంటి పరిస్థితి
- చంద్రబాబు పాలనంతా మోసాలు, అన్యాయాలే
వైసీపీ అధినేత జగన్ కు 25 సంవత్సరాల విజన్ ఉందని ఆ పార్టీ నేత, విజయవాడ లోక్ సభ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) తెలిపారు. జగన్ లాంటి నాయకుడితోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారనీ, వాళ్ల భవిష్యత్ ఏంటో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఈరోజు వైసీపీ శ్రేణులతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ మూడు వారాలు యుద్ధంలాంటి పరిస్థితి అనీ, వైసీపీ కార్యకర్తలు శ్రమించి పనిచేయకుంటే తనతో పాటు జగన్ కూడా ప్రజలకు సేవలు అందించలేమని వ్యాఖ్యానించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో పనిచేయడానికి జగన్ నవరత్నాలను ప్రకటించారని తెలిపారు. ఆయనకు మరో 25 ఏళ్ల విజన్ ఉందని చెప్పారు. మరోవైపు చంద్రబాబు పెన్షన్లు, రుణమాఫీ విషయంలో మాట తప్పారని వైసీపీ నేత సామినేని ఉదయభాను విమర్శించారు. చంద్రబాబు పాలనంతా మోసాలు, అన్యాయాలు, దగాయేనని దుయ్యబట్టారు.