Andhra Pradesh: జగన్ రూ.10 లక్షల క్యాష్, పది మంది మనుషులను పంపాడని ఒప్పుకోమని పోలీసులు ఒత్తిడి చేశారు: నందిగామ సురేష్ సంచలన ఆరోపణ

  • ఇంటి నుంచి బయటకు పిలిపించి తీసుకెళ్లారు
  • స్టేషన్లో చొక్కా విప్పించి నేలపై కూర్చోబెట్టారు
  • సీఐ నా భుజంపై కాలుపెట్టి మాట్లాడాడు

అమరావతిలో పంటపొలాల దగ్ధం కేసులో ఏపీ పోలీసులు తనను తీవ్రంగా అవమానించారని వైసీపీ బాపట్ల లోక్ సభ అభ్యర్థి నందిగామ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించారనీ, తన భుజంపై కాలుపెట్టి మంగళగిరి రూరల్ సీఐ ఫోన్ మాట్లాడారని తెలిపారు.

ఈ విషయమై ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ మాట్లాడుతూ..‘‘ఓ 10 మంది మా ఇంటికి వచ్చారు. మాట్లాడుదాం రండి అని పిలిచారు. కొంతదూరం తీసుకెళ్లాక బైక్ ఎక్కించారు. అక్కడి నుంచి జీపులోకి మార్చారు. దీంతో అనుమానం వచ్చి 'సార్.. మీరు పోలీసులా?' అని అడిగా. దీంతో బాగా లేట్ గా క్యాచ్ చేశావే’ అన్నారు.

‘కారును నా తమ్ముడు బైక్ పై ఫాలో అవుతుంటే వాడిని స్లో చేయండి అని ఫోన్ చేసి చెప్పారు. నా ఫోన్ కూడా తీసేసుకున్నారు. చివరగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో రెండో ఫ్లోర్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అక్కడే నేను కుర్చీలో కూర్చున్నా. అప్పుడే సీఐ వచ్చాడు. వస్తూనే ‘ఏంట్రా.. దొరగారిని కుర్చీలో కూర్చోబెట్టారు.. లే’ అని కసురుకున్నాడు.

నేను వెంటనే లేచి ‘సారీ సార్.. నాకు తెలియదు సార్’ అని చెప్పా. దీంతో ఆ.. కింద కూర్చో అని అన్నాడు. చుట్టూ 14 మంది కానిస్టేబుళ్లు కుర్చీలపై కూర్చుని నన్ను నేలపై కూర్చోబెట్టారు. చేతులు కట్టుకోమన్నారు. అలాగే చేశా. చొక్కా విప్పు అని చెప్పారు. ‘సార్.. అది ఇబ్బందేమీ లేదు.. వద్దని కోరా’. కానీ విప్పవోయ్ అని గదమాయించారు’’ అని నందిగామ సురేష్ వెల్లడించారు.

ఈ సందర్భంగా పోలీసులు తనను బెదిరించారని సురేష్ చెప్పారు. ‘‘నీ బయోడేటా అంతా మా దగ్గర ఉంది. మేము ఏ కేసు కావాలన్నా నీమీద పెట్టగలం. మేం చెప్పినట్లు చేయాలి అని చెప్పారు. నేను ఏం చేయాలి సార్? అని అడిగా. దీంతో ‘బెంగళూరు నుంచి జగన్ మోహన్ రెడ్డి 10 మంది మనుషులను నీ దగ్గరకు పంపించాడని ఒప్పుకోవాలి.

అక్కడి నుంచి నీకు ఫోన్లు వచ్చినట్లుగా నంబర్లు ఇస్తాం. ఈ నంబర్ల లిస్ట్ ను, రూ.10 లక్షల నగదును ఇచ్చాడని ఒప్పుకోవాలి. అలాగే ఎక్కడెక్కడ పంటపొలాలను తగలబెట్టామో ఒప్పుకోవాలి అని చెప్పారు. దీంతో నేను స్పందిస్తూ..‘నాకు తెలియదు కదా సార్.. నేనెలా ఒప్పుకుంటా’ అని అడిగా.

మా దగ్గర నీ గురించి సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. మరి సాక్ష్యాలు ఉన్నప్పుడు విచారణ ఎందుకు సార్? లోపల వేసేయొచ్చు కదా అని అడిగా. దీంతో కోపగించుకున్న పోలీసులు ‘మాకు తెలియక చేస్తున్నాంలే విచారణ’ అని చెప్పారు’’ అని సురేష్ గుర్తుచేసుకున్నారు. నిజం నువ్వు చెబితే ఒకరకంగా ఉంటుంది. మేం చెప్పిస్తే ఇంకో రకంగా ఉంటుంది. ‘మేం చెప్పించడం మొదలుపెడితే నువ్వు భరించలేక మొత్తం ఒప్పుకుంటావ్’ అని పోలీసులు బెదిరించారన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News