5G: వైద్య చరిత్రలో తొలిసారి... 5జీ రిమోట్ హ్యాండ్... 3 వేల కి.మీ. దూరం నుంచి ఆపరేషన్ చేసిన డాక్టర్!
- చైనా సాధించిన అత్యంత అరుదైన ఘనత
- బీజింగ్ లోని రోగికి హైనన్ ద్వీపం నుంచి ఆపరేషన్
- సహకరించిన హవాయీ 5జీ సాంకేతికత
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలను సవాల్ చేస్తున్న చైనా, మరో ఘనతను సాధించింది. బీజింగ్ లోని ఓ ప్రైవేట్ అసుపత్రిలో ఉన్న రోగికి, మెదడు సంబంధిత శస్త్రచికిత్స జరుగుతుండగా, ఆపరేషన్ థియేటర్ కు రాలేకపోయిన డాక్టర్, దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరం నుంచి 5జీ రిమోట్ హ్యాండ్ సహాయంతో శస్త్రచికిత్సను పూర్తి చేశాడు. ఈ విధంగా ఓ ఆపరేషన్ జరగడం ప్రపంచ వైద్య చరిత్రలో ఇదే తొలిసారి.
లింగ్ జీపీ అనే వైద్యుడు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఆపరేషన్ థియేటర్ లో ఉన్న అన్ని పరికరాలను బీజింగ్ కు ఎంతో దూరంలోని హైనన్ ద్వీపం నుంచి ఆపరేట్ చేస్తూ, రోగి మెదడులోకి బ్రెయిన్ పేస్ మేకర్ ను ఎక్కించే పనిని పూర్తి చేశారు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న రోగికి సాంత్వన చేకూర్చారు.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ హవాయీ తయారు చేసిన 5జీ సాంకేతికతతో అనుసంధానమైన కంప్యూటర్, రోబోట్ల ద్వారా ఈ పని పూర్తయింది. అయితే, ఈ పరిజ్ఞానాన్ని వాణిజ్యపరంగా హాస్పిటల్స్ లో వాడేందుకు ఇంకొంత సమయం పట్టవచ్చని వైద్య రంగ నిపుణులు అంటున్నారు.