Beauty Queen: అందాల సుందరి నుంచి ఆర్మీ ఆఫీసర్‌గా.. సైన్యంలో చేరి లెఫ్టినెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన గరిమా యాదవ్
- అందాల సుందరి నుంచి లెఫ్టినెంట్‌గా
- కఠిన శిక్షణను పూర్తి చేసిన గరిమా
- బలహీనతలను అధిగమిస్తే ఎవరైనా విజయాలు సాధించవచ్చన్న హరియాణా భామ
అందాల సుందరి గరిమా యాదవ్ సంచలన నిర్ణయం తీసుకుంది. హరియాణాకు చెందిన గరిమా.. మిస్ ఇండియా చార్మింగ్ ఫేస్- 2017 కిరీటాన్ని సొంతం చేసుకుంది. సిమ్లాలోని ఆర్మీ స్కూల్లో చదువుకున్న గరిమా అందాల లోకంలో అడుగుపెట్టినప్పటికీ ఆ వైపు పరుగు పెట్టకపోవడం విశేషం. అడపాదడపా అందాల పోటీల్లో పాల్గొన్నప్పటికీ లక్ష్యం నుంచి ఎప్పుడూ పక్కకు తప్పుకోలేదు.
న్యూఢిల్లీలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన అనంతరం కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన గరిమా.. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో చేరి శిక్షణ తీసుకుంది. సైన్యంలో చేరాలన్న పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకుని లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టింది.
లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం గరిమా మాట్లాడుతూ.. శిక్షణ సమయంలో తొలుత కొంత ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ పట్టుదలతో శిక్షణ పూర్తి చేసినట్టు పేర్కొంది. తొలుత మనలోని బలహీనతలను అంగీకరించి వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తే ఎవరైనా విజయాలు అందుకోగలుగుతారని గరిమా పేర్కొంది.