Pawan Kalyan: నర్సాపురం నుంచి లోక్ సభకు పోటీకి దిగుతున్న కేఏ పాల్
- మరో స్థానం నుంచి కూడా పోటీ
- నేడు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
- పవన్ పార్టీని మూసేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాను ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నది ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే, మరో స్థానం నుంచి కూడా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ నెల 22న నామినేషన్ వేయనున్నట్టు చెప్పిన ఆయన నేడు ప్రజాశాంతి పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై పాల్ మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని మూసేసినట్టుగానే పవన్ కూడా జనసేనను మూసివేస్తారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాలా మార్చే సత్తా కేవలం ప్రజాశాంతి పార్టీకే సాధ్యమన్నారు. హెలికాప్టర్‌లలో తిరుగుతున్న నేతలకు ఓట్లు వేయొద్దని, కానీ హెలికాప్టర్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. విజయవాడ సెంట్రల్ నుంచి బరిలోకి దిగుతున్న టీడీపీ అభ్యర్థి బోండా ఉమ తనకు ఫోన్ చేసి ఆశీస్సులు కోరారని పాల్ తెలిపారు.