Telangana: రామ జన్మభూమి, రావణ జన్మభూమి.. ఈ పంచాయితీలు రాజకీయ పార్టీలు చేయాలా?: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు కేసీఆర్ సూటి ప్రశ్న
- ‘రామజన్మభూమి’పై నా స్టాండ్ ఏంటని లక్ష్మణ్ అడిగారు
- మీ పార్టీ ఎవరి కోసం పని చేస్తోంది?
- ఆ స్టాండ్ గురించి ఫస్ట్ నువ్వు చెప్పు
రామజన్మభూమిపై తన స్టాండ్ ఏంటని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తనను అడిగిన విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నిజామాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘లక్ష్మణ్ గారూ!, మీది ప్రజల కోసం పని చేసే పార్టీనా? లేక మత ప్రచారం కోసం పని చేసే పార్టీనా? ఆ స్టాండ్ గురించి ఫస్ట్ నువ్వు చెప్పు. నీ స్టాండ్ నువ్వు చెప్పిన తర్వాత నేను చెబుతా.
ఎందుకంటే, రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమి.. దుర్యోధన జన్మభూమి, సత్యభామ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి.. ఈ పంచాయితీలు రాజకీయపార్టీలు చేయాలనా? ఏ జన్మభూమి ఎవరిదో ఎవరు నిర్ణయించాలి? శృంగేరి పీఠంలో జగద్గురువు శంకరాచార్యులు, చిన జీయర్ స్వామి, పీఠాధిపతులు, ధర్మ ప్రచార కర్తలు, మఠాలు, మఠాధిపతులు వాళ్లు చేయాలి.
అది మన రాజకీయ నాయకుల పని కాదు. మనం ప్రజల సమస్యలు పరిష్కరించాలి కానీ, జన్మభూముల గురించి మాట్లాడితే ప్రజల జాతకాలు మారవు. జన్మభూమి ఎవరిదని పంచాయితీలు చెప్పడం రాజకీయపార్టీల, ప్రధాన మంత్రుల పని కాదు. అంత అత్యవసరం అనుకుంటే, రెండు వర్గాలకు పంచాయితీ ఉంటే.. మేటర్ సుప్రీంకోర్టులో ఉంది, న్యాయస్థానాలు తేలుస్తాయి. మనం జోక్యం చేసుకో అక్కర్లేదు’ అని హితవు పలికారు.