AP: ఐదు కోట్ల మంది ప్రజలు ఏకం కావాలి.. జగన్ కుట్రలపై ఆలోచించాలి: సీఎం చంద్రబాబునాయుడు
- ఐదు కోట్ల మంది ప్రజలు అభివృద్ధికి కవచంగా ఉండాలి
- జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారు
- కేసీఆర్ డబ్బులు పంపిస్తే మనం అమ్ముడుపోతామా?
ఐదు కోట్ల మంది ప్రజలు ఏకం కావాలని, అభివృద్ధికి కవచంగా ఉండాలని.. జగన్ చేసే కుట్రలపై ఆలోచించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. అనంతపురంలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి డబ్బులు పంపిస్తే, ఆ డబ్బులకు మనం అమ్ముడుపోతామా? అని ప్రశ్నించారు.
‘మొన్నటి వరకూ నాకు గిఫ్ట్ పంపిస్తానన్నాడు. ‘నా బర్త్ డే గిఫ్ట్ కు పది బర్త్ డే గిప్ట్ లు నీకు రెడీగా ఉంటాయి సిద్ధంగా ఉండమని’ నేను చెప్పా. మీ ఆవేశం, కోపం చూసి ఇప్పుడు తోక జాడించే పరిస్థితికి వచ్చారు. తెలంగాణలో రాజకీయం గురించి మీరు ఆలోచించాలి. మన ఆర్థిక మూలాలపై దెబ్బతీస్తున్నారు. మన వాళ్లకు అక్కడ ఏవైనా ఆస్తులుంటే నోటీసులు ఇస్తున్నారు. కేసీఆర్ ఇక్కడ పెత్తనం చేయాలనుకుంటున్నాడు. దొడ్డి దారిన పెత్తనం చేయాలనుకుంటున్నాడు. జగన్ మోహన్ రెడ్డిని ఒక పావుగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు’ అని విమర్శించారు.