Lakshmi`s NTR: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘లక్ష్మీస్ వీర గ్రంథం’ సినిమాల విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- ఈ చిత్రాల విడుదల ఆపాలని వేసిన పిటిషన్ల కొట్టివేత
- తాము కలగజేసుకోలేమని తెలిపిన న్యాయస్థానం
- అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే చర్యలు తీసుకోవాలని టీఎస్ ప్రభుత్వానికి ఆదేశం
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘లక్ష్మీస్ వీర గ్రంథం’ సినిమాల విడుదల ఆపాలని కోరుతూ వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఈ చిత్రాల విడుదలను ఆపటం కుదరదని, భావ స్వేచ్ఛ విషయంలో తాము కలగజేసుకోలేమని న్యాయస్థానం పేర్కొంది. లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ చిత్రాల్లో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే వాటిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో, ఈ సినిమాల విడుదలకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది.
కాగా, ఈ సినిమాలను ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ టీఎస్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు దీన్ని కొట్టేసింది.
ఇదిలా ఉండగా, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు తెలంగాణ హైకోర్టు అనుమతించడంపై ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తొలుత ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నారు కానీ, 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు వర్మ ప్రకటించడం విదితమే.